కలం, ఖానాపూర్: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని (Khanapur Govt Hospital) ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అనంతరం ఓపీ, ఐపీ, రోగుల నమోదు, సాధారణ వైద్య సేవలు, ప్రసూతి విభాగం, రక్త పరీక్షల విభాగం, మందుల గదిని పరిశీలించారు. ఆయా విభాగాల రిజిస్టర్లను తనిఖీ చేసి, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో ప్రతిరోజూ అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అందుబాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా హాజరై రోగులకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ఆసుపత్రి(Khanapur Govt Hospital)కి వచ్చే ప్రతి రోగితో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి సమస్యలను తెలుసుకుని అవసరమైన వైద్యం, మందులు అందించాలని తెలిపారు. ఈ తనిఖీలో డీసీహెచ్ఎస్ కాశీనాథ్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ స్వర్ణ రెడ్డి, తహశీల్దార్ సుజాత, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోయబ్ హుస్సేన్, వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ మాస్ వార్నింగ్
Follow Us On : WhatsApp

