కలం, నిర్మల్ : ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ (Nirmal) అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ (Kishore Kumar) హెచ్చరించారు. గురువారం నిర్మల్ రూరల్ మండలంలోని న్యూ పోచంపాడు గ్రామంలో చెరువు శిఖం భూములను పరిశీలించిన ఆయన, అధికారులతో కలిసి భూముల హద్దులను పరిశీలించారు.
శ్రీరామ్ సాగర్ జలాశయం ముంపు కారణంగా గ్రామానికి పునరావాసం కల్పించిన సమయంలో ప్రభుత్వం గ్రామ అవసరాల కోసం కొంత భూమిని కేటాయించిందని అధికారులు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు అక్రమంగా డీ-1 పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములతో పాటు చెరువు శిఖం భూములను ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడతామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ మూర్తి, తహసీల్దార్ ప్రభాకర్, నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, గ్రామ సర్పంచ్ కొండా పద్మ శ్రీనివాస్, ఆర్ఐ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

