Mobile Popup Ad
Mobile Popup Ad

106 మంది బాలికలకు ఒక్కటే టాయిలెట్..!

కలం, నిర్మల్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రానికి సమీపంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Manjulapur Govt High School) లో విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాలికల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలో మొత్తం 225 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, అందులో 106 మంది బాలికలు ఉన్నారు. అయితే వీరందరికీ ఒకే ఒక్క మూత్రశాల మాత్రమే ఉండటంతో విరామ సమయంలో గంటకు పైగా క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

బాలురకు మరుగుదొడ్లే లేవు

పాఠశాలలో 112 మంది బాలురు ఉన్నప్పటికీ వారికి ప్రత్యేకంగా టాయిలెట్స్ లేకపోవడంతో బహిరంగ ప్రదేశాలకే వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో పాములు, విషజంతువుల భయం వెంటాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తవి కడతామంటూ పాతవే కూల్చివేత

గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు-మనబడి’ పథకం కింద రూ.1.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో పాత మూత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపడతామని చెప్పినా, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశాడని సమాచారం. ఫలితంగా విద్యార్థులు మరింత ఇబ్బందుల్లోకి నెట్టబడ్డారు. పాఠశాలకు చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో పశువులు, పందులు ఆవరణలోకి వస్తుండటం సాధారణమైంది. సెలవు దినాల్లో ఆకతాయిలు పాఠశాలలోకి ప్రవేశించి మద్యం సేవిస్తూ, నీటి నల్లాలను ధ్వంసం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

చెట్లకిందే మధ్యాహ్న భోజనం

డైనింగ్ హాల్ లేకపోవడంతో విద్యార్థులు చెట్లకిందే మధ్యాహ్న భోజనం చేయాల్సి వస్తోంది. వంటగది లేకపోవడంతో రేకుల షెడ్డులోనే భోజనం వండుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి: కౌన్సిలర్ విజయలక్ష్మి

మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చింది. ప్రస్తుతం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాత్రూంలు, మరుగుదొడ్లు లేక బాలికలు, బాలురు అవస్థలు పడుతున్నారు. గత ఏడాది ఇదే సమస్యను అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే బాత్రూంల నిర్మాణ పనులు చేపట్టి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>