కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రజా భవన్‌లో వినతి

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్లకు నైట్ డ్యూటీలు ఎత్తివేయాలని, వీక్లీ ఆఫ్ అమలు చేయాలని, సీఎల్స్ పై ఇచ్చిన ఉత్తర్వులను నాన్ టీచింగ్, వర్కర్లకు వర్తింపజేయాలని కేజీబీవీ వర్కర్లు డిమాండ్ (KGBV Workers Demands) చేస్తున్నారు.  ఈ మేరకు ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో ప్రజా భవన్‌లో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, ASPD లకు వినతిపత్రాలు అందించారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎల్ పద్మ, ఎం.సుధాకర్‌లు మాట్లాడుతూ.. కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బందికి ఇస్తున్న క్యాజువల్ లీవ్స్ పై ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల్లో నాన్ టీచింగ్, వర్కర్లకు వర్తించే విషయంలో స్పష్టత లేదన్నారు. అందువల్ల నాన్ టీచింగ్, వర్కర్లకు కూడా వర్తించేలా స్పష్టతనిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.

అకౌంటెంట్లకు, వర్కర్లకు నైట్ డ్యూటీలను కేటాయించి, వారిని తీవ్రమైన పనిభారానికి గురి చేస్తున్నారని అన్నారు. ఇది అన్యాయం అని, ఎస్‌పీడీ ఇచ్చిన హామీ మేరకు నైట్ డ్యూటీలను రద్దు చేయాలన్నారు. అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బందికి, ముఖ్యంగా వర్కర్లకు వీక్లీ ఆఫ్‌లు మెజారిటీ కేజీబీవీల్లో పూర్తిగా అమలు కావడం లేదన్నారు. జాబ్ చార్ట్ కూడా సక్రమంగా అమలు కావడం లేదని, నాన్ టీచింగ్, వర్కర్లకు జాబ్ చార్ట్‌కు మించి (ఎక్కువ పనిగంటలు) పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు వీక్లీ ఆఫ్‌లు సరిగ్గా అమలు కాకపోవడం, జాబ్ చార్టుకు మించి పనిచేయించడం, ఇటీవల నైట్ డ్యూటీలు వేయడంతో, అకౌంటెంట్‌లు, వర్కర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. వర్కర్లందరికీ వారానికి ఒకరోజు తప్పకుండా సెలవు వర్తించేలా వీక్లీ ఆఫ్ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాబ్ చార్ట్ సక్రమంగా అమలయ్యేలా, నైట్ డ్యూటీలను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్, వర్కర్లకు సీఎల్స్ వర్తించేలా ఈరోజే సవరణ ఉత్తర్వులను విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యం, రాష్ట్ర నాయకులు నరేందర్, అరుణ్ కుమార్, రాజేశ్వర్, రాజన్న, దేవదానం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>