కలం, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజారోగ్య సేవలందించిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల (NHM Employees) సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కరోనా ప్రారంభ దశలో పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజుల కొరత వంటి ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగులు ఇంటింటి ఫీవర్ సర్వేలు, కరోనా లక్షణాల గుర్తింపు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఇతర ప్రజారోగ్య సేవలను అంకితభావంతో నిర్వహించారని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేశారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డా.బాలకృష్ణ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాల కోసం పనిచేసిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు హైమవతి, రామకృష్ణ, రాజు, మహతి, చంద్రకళ, రజియా తదితరులు పాల్గొన్నారు.

