కలం, వెబ్‌డెస్క్: న్యూయార్క్ మేయర్ (New York Mayor) జోహ్రాన్ మమ్దానీ (Johran Mamdani) కోహినూర్ డైమండ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాలతో భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చారిత్రక కోహినూర్ డైమండ్ (Kohinoor Diamond)ను భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని తాను కింగ్‌ను కోరనున్నట్లు ప్రకటించారు. 9/11 మెమోరియల్ వద్ద జరిగిన నివాళుల కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోహినూర్ తిరిగివ్వడం తన అధికారిక ఎజెండాలో లేదని, అయితే కింగ్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే ఈ విషయాన్ని తప్పకుండా ప్రస్తావిస్తానని ఆయన వెల్లడించారు.
అమెరికా స్వాతంత్య్రాన్ని ప్రకటించి 250 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బ్రిటన్ రాజకుటుంబం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా న్యూయార్క్ చేరుకున్న కింగ్ చార్లెస్‌ను కలిసిన మేయర్ మమ్దానీ కోహినూర్ డైమండ్ భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయమని గుర్తు చేశారు. 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మహారాజా దులీప్ సింగ్ నుంచి ఈ డైమండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుందని , దీనిపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్ టవర్‌లో ఉన్న ఈ 105.6 క్యారెట్ల వజ్రాన్ని భారత్‌కు అప్పగించాలన్న డిమాండ్ మమ్దానీ వ్యాఖ్యలతో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

