కలం, స్పోర్ట్స్: ఐదు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ న్యూయార్క్ (New York) కిక్స్ జట్టు ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. సాన్ ఆంటోనియో స్పర్స్‌పై సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో నగరవ్యాప్తంగా పండగ వాతావరణం (Celebrations) నెలకొంది. అయితే, ఈ ఆనందం కాసేపట్లోనే పెద్ద భద్రతా సవాలుగా మారింది. నగరంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
ఫైనల్ మ్యాచ్ ముగియగానే వేలాది మంది అభిమానులు మాడిసన్ స్క్వేర్ గార్డెన్, టైమ్స్ స్క్వేర్ వీధుల్లోకి చేరి సంబరాలు మొదలుపెట్టారు. చాలా మంది బాణసంచా కాలుస్తూ ప్రశాంతంగానే ఆనందాన్ని పంచుకున్నారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని గ్రూపులు వీరంగం సృష్టించాయి. రోడ్లపై ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తూ, పబ్లిక్ బస్సుల పైకి ఎక్కి నానా హంగామా చేశారు. ఈ క్రమంలో ఒక బస్సు పూర్తిగా మంటల్లో తగలబడింది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రక్షణ కవచాలు ధరించిన వందలాది మంది పోలీసులు, గుర్రపు దళాలు రంగంలోకి దిగి వీధులను ఖాళీ చేయించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక టైమ్స్ స్క్వేర్ సమీపంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కిక్స్ యజమాని జేమ్స్ డోలన్ స్పందిస్తూ.. అభిమానులంతా బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, అందరూ సురక్షితంగా ఉండటమే ముఖ్యమని కోరారు. కిక్స్ జట్టు చివరిసారిగా 1973లో ఈ టైటిల్ గెలిచింది. మళ్లీ 53 ఏళ్ల తర్వాత ఈ విజయం దక్కడంతో ఈ వారంలోనే నగరంలో ఘనంగా విజయోత్సవ పరేడ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

