పంద్రాగస్టుకూ పాత యూనిఫాంలేనా?

కలం, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు కొత్త యూనిఫాంలు (New Uniforms) అందకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్నప్పటికీ కొత్త యూనిఫాంలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఈసారి కూడా పాత దుస్తులతోనే జాతీయ పండుగ వేడుకలలో పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల యూనిఫాంల రంగు, డిజైన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అయితే యూనిఫాంల తయారీకి అవసరమైన వస్త్రం గుజరాత్‌ నుంచి సరఫరా కావడంలో జాప్యం జరగడంతో కుట్టుపని ఆలస్యమైంది. ఇప్పటికే విద్యార్థులకు షూస్‌, బ్యాగులు పంపిణీ చేసినప్పటికీ యూనిఫాంలు మాత్రం ఇంకా అందలేదు.

జిల్లాలో 48 వేల మందికి పైగా విద్యార్థుల నిరీక్షణ

నిర్మల్ (Nirmal) జిల్లాలో 756 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21,808 మంది బాలురు, 26,341 మంది బాలికలు కలిపి మొత్తం 48,148 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ కొత్త యూనిఫాంల పంపిణీ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూనిఫాంల కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించారు. బాలుర షర్ట్‌లు, బాలికల ప్యాంట్ల కుట్టుపని కొంత మేర పూర్తయినప్పటికీ మిగిలిన యూనిఫాంల తయారీ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యే గడువుపై సందిగ్ధత నెలకొంది.

పాత యూనిఫాంలతోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు?

ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కొత్త యూనిఫాం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గడువులోగా పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా కుట్టుపని దశలోనే జాప్యం కొనసాగుతోంది. కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూడా పాత యూనిఫాంలనే అందించినట్లు తెలుస్తోంది. దీంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కొత్త యూనిఫాంల స్థానంలో పాత దుస్తులతోనే విద్యార్థులు పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తికావాల్సిన ప్రక్రియ రెండు నెలలు దాటినా కొలిక్కి రాకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వస్త్రం అందగానే పంపిణీ పూర్తి చేస్తాం: డీఈఓ భోజన్న

యూనిఫాంల పంపిణీ ఆలస్యానికి ప్రధాన కారణం వస్త్ర సరఫరాలో జాప్యమేనని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) భోజన్న తెలిపారు. వస్త్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే మిగిలిన కుట్టుపని పూర్తి చేసి విద్యార్థులందరికీ యూనిఫాంలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే బాలికల ప్యాంట్‌లు , బాలుర షర్ట్స్ కుట్టుపని పూర్తయిందని, మిగిలిన యూనిఫాంల తయారీ కూడా వస్త్రం అందిన వెంటనే పూర్తి చేసి పంపిణీ చేపడతామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>