epaper
Thursday, March 5, 2026
epaper

‘ఉపాధి హామీ‘కి బ్రేక్ .. కొత్త రూల్స్‌తో ఆగిన పనులు

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ఉపాధి హామీ (MGNREGA) పనులు ఆగిపోయాయి. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్ఎంఎంస్) యాప్‌లో కూలీల ఐరిష్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఇందుకు కారణమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజూ సుమారు 2 లక్షల మంది కూలీలు ఉపాధికి దూరం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోజూ పనుల కోసమని వెళ్లడం, అటెండెన్స్ పడటం లేదని ఇంటికి రావడం మూడు, నాలుగు రోజులుగా జరుగుతోంది. గతంలో రాష్ట్రంలోని 12 వేలకుపైగా పంచాయతీల పరిధిలో రోజుకు సుమారు 4 లక్షల మంది హాజరయ్యే ఉపాధి పనులకు గత మూడు రోజులుగా లక్షన్నర నుంచి 2 లక్షలలోపే కూలీలు హాజరవుతున్నారు. మిగతావారు ఐరిష్ కారణంగా ఉపాధికి దూరమవుతున్నారు.

53.99 లక్షల మంది ఉపాధి కూలీలు

రాష్ట్రంలో కోటి 66 వేల మంది రిజిష్టర్డ్ ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వీరిలో 53.99 లక్షల మంది ఏడాదిలో కొద్ది రోజులైనా కూలీకి వెళ్లే యాక్టివ్ వర్కర్స్‌గా ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 3 లక్షల నుంచి 5 లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. వ్యవసాయ పనులు ముగిశాక పూర్తిగా పనుల్లేని సమయంలో రోజూ 8 లక్ష ల నుంచి 10 లక్షల మంది కూలీల వరకు పనులకు హాజరవుతుంటారు. గతంలో పనులకు వచ్చే కూలీలను రోజుకు రెండు సార్లు గ్రూపు ఫొటో తీసి ఎన్ఎంఎంస్ యాప్‌లో అప్ లోడ్ చేయడం ద్వారా అటెండెన్స్ వేసేవారు. ఒక గ్రూపు ఫొటోలో ఉన్న కొందరు కూలీలు, మరో గ్రూప్ ఫొటోలో ఉండడం, పని చేయని వ్యక్తులు ఫొటోలు దిగడంతో కొందరు బినామీల పేరిట మస్టర్ జనరేట్ అయి కూలీ డబ్బులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒక్కో కూలీ ఐరిష్ ద్వారా ఈకేవైసీని ముందే అప్‌డేట్ చేసి.. ఈ నెల 1 నుంచి ఐరిష్ ద్వారానే అటెండెన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఐరిష్ అటెండెన్సే ఇప్పుడు కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తలనొప్పిగా మారింది.

ఇలాగైతే పనులు జరిగేదెలా ?

కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో (MGNREGA) కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభం కావడంతో ఎండలకు కూలీలు తీవ్రంగా నీరసిస్తున్నారు. రాష్ట్రంలో ఐరిష్ బేస్డ్ అటెండెన్స్ కోసం కూలీల ఈకైవైసీ పూర్తయింది. కానీ ఇప్పుడు కూలీల ఐరిష్ క్యాప్చర్ కావడం లేదు. ఒక్కో గ్రూపులో నలుగురైదుగురికే అటెండెన్స్ పడుతోంది. పనులు ఎలా చేస్తున్నారో పర్యవేక్షించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లకు అటెండెన్స్ తీసుకోవడమే ఇప్పుడు పెద్ద పనయిపోయింది. రోజూ 100 మంది కూలీల అటెండన్స్ తీసుకునేసరికి టైం అయిపోతుంది. ఆన్ లైన్ లో కూలీల డేటా ఉన్నప్పటికీ.. సర్వర్ సమస్యతో కొందరు కూలీల ఈకేవైసీ డేటా యాప్‌లో కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో సెల్ ఫోన్ సిగ్నల్ సమస్య ఉంది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్ల ఫోన్లకు యాప్ సరిగ్గా సపోర్ట్ చేయడం లేదు.

Read Also: బల్దియా అప్పులకు విముక్తి.. రూ. 4,780 కోట్ల భారం మోయనున్న ప్రభుత్వం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!