కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి నేపాల్ గ్యాంగ్ (Nepali Gang) కలకలం రేపింది. ఇటీవలే ఐపీఎస్ అధికారి భార్యను ఇంట్లో పని చేస్తున్నపనిమనిషే హత్య చేసి పారిపోయిన ఉదంతం మరవకముందే.. అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకుర్ ప్రాంతంలోని గల్ఫ్ ఎన్ క్లిప్‌లో డాక్టర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డాడు. వారి ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు నేపాలీలు విజయలక్ష్మి దంపతులకు మత్తు మందు ఇచ్చి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, రూ.30 వేలు చోరీ చేసి ఉడాయించారు. ఇద్దరు నేపాలీలతో పాటు మరో అయిదుగురు కూడా ఈ దోపిడీలో పాల్గొన్నట్లు సమాచారం.
13 రోజుల కిందటే చేరి..
డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో 13 రోజుల కిందటే ఇద్దరు నేపాలీలు పనిమనుషులుగా చేరినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో దోపిడీ చేయడం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు అర్థమవుతోంది. వారి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే.. ఇంట్లో చేరినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ సమయంలో ఇంట్లోని సీసీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో నేపాలీల వరుస దోపిడీలు తీవ్ర ఆందోళనగా మారుతున్నాయి.

