కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పట్టణంలో నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష – 2026(NEET PG 2026 Exam) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో బైక్ హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో నిర్ణీత సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముందే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ఓ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ విధానం, పరీక్షా నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో, సురక్షితంగా చేరుకునేలా ప్రత్యేక రవాణా సహాయ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో బైక్ హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకున్న అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఇబ్బంది లేకుండా చేరుకునేందుకు ఈ బైక్ హెల్ప్ సెంటర్ల ద్వారా అవసరమైన రవాణా సహాయం అందించారు. అదనపు కలెక్టర్ ఆయా హెల్ప్ సెంటర్లను కూడా పరిశీలించి, అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సిబ్బందికి సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు, పరీక్షా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నీట్ పీజీ–2026 పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. ఆర్‌డిఓ నవీన్, డిఎస్పి(ఎస్.బి)రమణా రెడ్డి తదితరులు ఉన్నారు.

