కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ 2026 కోసం భారత అథ్లెటిక్స్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు (Neeraj Chopra) స్థానం దక్కింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అతని ఎంపిక ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. కామన్వెల్త్ గేమ్స్‌కు (Commonwealth Games) ముందు జరిగే పోటీల్లో అతను చేసే ప్రదర్శన ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) ఆదివారం 32 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో 22 మంది పురుషులు, 10 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. భారత్‌కు కేటాయించిన పూర్తి కోటాను ఫెడరేషన్ వినియోగించింది.
జట్టులో నీరజ్ చోప్రాతో పాటు ఎం. శ్రీశంకర్, తేజస్విన్ శంకర్, తాజిందర్‌పాల్ సింగ్ తూర్, ప్రవీణ్ చిత్రవేల్, రోహిత్ యాదవ్ వంటి ప్రముఖ అథ్లెట్లు చోటు దక్కించుకున్నారు. మహిళల విభాగంలో పారుల్ చౌదరి, మన్‌ప్రీత్ కౌర్, సీమ, నిధి రాణి వంటి క్రీడాకారిణులు ఎంపికయ్యారు. అయితే ఈ జట్టు ప్రకటనలో ఎక్కువ చర్చకు దారి తీసింది నీరజ్ చోప్రా ఎంపికే. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు కొన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అర్హత ప్రమాణాలు సాధించేందుకు అవకాశం ఇవ్వాలని నీరజ్ కోరినట్లు ఏఎఫ్‌ఐ వెల్లడించింది.
దీంతో అతని పేరును జట్టులో చేర్చినా, తుది ఎంపికను భవిష్యత్ ప్రదర్శన ఆధారంగా సమీక్షించనున్నారు. ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు విషయంలో కూడా ఇదే విధానం వర్తించనుంది. గేమ్స్‌కు ముందు అతని ప్రదర్శనను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అనుభవజ్ఞులు, యువ ప్రతిభ కలయికతో భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి నీరజ్ చోప్రాపైనే ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు అతను ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

