కలం, వెబ్‌డెస్క్ : భారత దేశ సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన చారిత్రాత్మక సంఘటన పోఖ్రాన్ అణుపరీక్షలు. 1998 మే 11 న జరిగిన పోఖ్రాన్ -2 అణు పరీక్షలు విజయవంతం కావడంతో ఆ రోజును నేషనల్ టెక్నాలజీ డే గా నిర్వహిస్తున్నారు. నేడు మే 11 సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) జాతీయ సాంకేతిక శుభాకాంక్షలు తెలిపారు. 1998లో పోఖ్రాన్‌లో విజయవంతమైన పరీక్షలకు దారితీసిన భారత శాస్త్రవేత్తల కృషిని, అంకితభావాన్ని మోదీ స్మరించుకున్నారు. చారిత్రాత్మక ఘట్టం భారతదేశ శాస్త్రీయ నైపుణ్యాన్ని, అచంచలమైన నిబద్ధతను ప్రతీకగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
ఆత్మనిర్భర భారత దేశ నిర్మాణంలో టెక్నాలజీ ఒక కీలక స్తంభంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ అవకాశాలను విస్తరించడంతో పాటు అభివృద్ధికి దోహదపడడంలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. యువత ప్రతిభ, పరిశోధనలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. దేశ పురోగతికి, భారతీయులు ఆకాంక్షలకు ఉపయోగపడే పరిష్కారాలను రూపొందించడానికి తమ ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తుందని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు.

