అవయవదానంతో మరో దేహంలో జీవం: వడ్డేపల్లి రామచందర్‌

క‌లం, క‌రీంన‌గ‌ర్‌: “మరణంతో జీవితం ముగిసిపోదు.. మన అవయవాలు మరో దేహంలో జీవిస్తూ ఇంకొకరికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. ఇంతకంటే గొప్ప మానవ సేవ మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ నేత్ర, అవయవదానానికి ముందుకు రావాలి” అని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌ (Vaddepalli Ramchander) పిలుపునిచ్చారు. తండ్రి స్మారకార్థం కుటుంబ సభ్యులు మరణానంతరం నేత్ర, అవయవదానానికి అంగీకరించడం అభినందనీయమని, ఈ నిర్ణయం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి ఈదునూరి పోశం గత ఏడాది అక్టోబరు 7న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్మారకార్థం బుధవారం కుటుంబ సభ్యులు తమ నివాసంలో త్రీడీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. అనంతరం నేత్ర, అవయవదాన అంగీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ పోశం త్రీడీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఐదుగురి అంగీకారం

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు హరికృష్ణ, సుధారాణి, హరిణి, సాత్విక్‌, రాధాకృష్ణ తమ మరణానంతరం నేత్ర, అవయవాలను దానం చేస్తామని ప్రకటించారు. వారికి జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌ చేతుల మీదుగా అభినందన పత్రాలను సదాశయ ఫౌండేషన్‌ జాతీయ ప్రచార కార్యదర్శి కె.ఎస్‌. వాసు అందజేశారు.

తెలంగాణలోనూ గౌరవించాలి

సదాశయ ఫౌండేషన్‌ జాతీయ ప్రచార కార్యదర్శి కె.ఎస్‌. వాసు మాట్లాడుతూ.. తమిళనాడులో అవయవదానం చేసిన కుటుంబాలను ప్రభుత్వం గౌరవంగా సత్కరిస్తోందన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలకు దానం చేస్తే, అతని పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుందని, తెలంగాణలోనూ ఇదే తరహాలో అవయవదాత కుటుంబాలను గౌరవించాలని కోరారు. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక లేఖ రాస్తా

అవయవదాత కుటుంబాలను గౌరవించే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ ఎస్సీ కమిషన్‌ సభ్యుడిగా ప్రత్యేక లేఖ రాస్తానని వడ్డేపల్లి రామచందర్‌ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి సదాశయ ఫౌండేషన్‌ ముందుగా తనకు లేఖ సమర్పించాలని సూచించారు. తండ్రి స్మారకార్థం కుటుంబ సభ్యులు నేత్ర, అవయవదానానికి అంగీకారం ప్రకటించడం ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తాళ్లపల్లి యుగంధర్‌, మీర్జా ఫజల్ బేగ్‌తో పాటు కుటుంబ సభ్యులు పోషమ్మ, రాధాకృష్ణ, శంకరయ్య, రామకృష్ణా, హరికృష్ణ, గోపికృష్ణ, అరుణాదేవి, సుధాదేవి, హరిణి, సాత్విక్‌, హారతి, ఈదునూరి శంకర్‌, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>