కలం, కరీంనగర్ బ్యూరో: మాదకద్రవ్యాలు లేని ‘నషా ముక్త్ భారత్’(Nasha Mukt Bharat) సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్-2047’ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ కార్యక్రమాన్ని కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ, పోలీస్, ఇతర శాఖల అధికారులు, ఎస్ఆర్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా చిన్నాభిన్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నివారణకు జిల్లాలో పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, విద్యాశాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులు కొనుగోలు చేసే చాక్లెట్లు, ఇతర తినుబండారాల కవర్లు, ప్యాకెట్లపై ఉన్న వివరాలను తప్పనిసరిగా గమనించాలని సూచించారు. సరదాగా మొదలై జీవితాలను అంధకారంలోకి నెట్టే డ్రగ్స్‌కు యువత, విద్యార్థులు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి విద్యాసంస్థలో, అలాగే జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమం అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ సమక్షంలో అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ శాఖ చైర్మన్ సంగేం లక్ష్మణరావు నేతృత్వంలో గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్‌వో రాజ్ గోపాల్ రావు, రెడ్ క్రాస్ కార్యదర్శులు ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, కనపర్తి మనోహర్ రావు, టీజీవో, టీఎన్జీవో సంఘాల నాయకులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

