కొత్తగూడెం రైల్వే సమస్యలపై కూనంనేని వినతి

కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం(Kothagudem) నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక రైల్వే సమస్యలను(Railway Issues) తక్షణమే పరిష్కరించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రైల్వే అధికారులను కోరారు. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, జీఎం సెక్రటరీ మల్లాది శ్రీనివాస్‌లను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసి సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మున్సిపల్ రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు 22 అడుగుల రైల్వే స్థలాన్ని కేటాయించాలని, రైల్వే స్థలాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోడ్ల విస్తరణకు సహకరించాలని కూనంనేని కోరారు. అలాగే బూడిదగడ్డ, రైటర్ బస్తీ, రామవరం–గరిమెళ్లపాడు ప్రాంతాల్లో ఆర్‌యూబీలు, లెవల్ క్రాసింగ్‌లు నిర్మించాలని, సర్వారంలో రైతుల కోసం అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హేమచంద్రాపురం బైపాస్‌లో కొత్త ఆర్‌వోబీ నిర్మించడంతో పాటు సింగరేణి మెయిన్ ఆసుపత్రి వద్ద ఉన్న పాత ఆర్‌వోబీని విస్తరించాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో రద్దయిన మణుగూరు–కాజీపేట, భద్రాచలం రోడ్–డోర్నకల్, బెల్గాం–మణుగూరు రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్‌లో స్లీపర్ బోగీలను కూడా వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు తిరుపతికి నేరుగా వారాంతపు రైలును నడపాలని, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును ‘కొత్తగూడెం రైల్వే స్టేషన్‌’గా మార్చాలని కోరారు. ఈ సమస్యలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>