కలం, యాదగిరిగుట్ట: గ్రామీణ ప్రాంతాల్లో హెచ్ఐవీ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స సేవలను మరింత చేరువ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (AAMలు) ద్వారా క్షేత్రస్థాయిలోనే సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు (Rural HIV Testing Services) లో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది.
95-95-95 లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి
హెచ్ఐవీ నియంత్రణలో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను సాధించేందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ ఆరోగ్య స్థితిపై అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్ లోడ్‌ను నియంత్రణలోకి తీసుకురావడం ఈ లక్ష్యాల్లో కీలకమైనవి.
ఐదు మండలాల్లో క్షేత్రస్థాయి కార్యాచరణ
యాదగిరిగుట్ట, మోత్కూరు, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాలకు చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి హెచ్ఐవీ పరీక్షలు, అనుమానిత కేసుల గుర్తింపు, వ్యాధి నిర్ధారణ అనంతరం చికిత్సా కేంద్రాలకు అనుసంధానం, చికిత్స కొనసాగింపు, రోగుల ఫాలోఅప్‌పై శిక్షణ ఇచ్చారు. చికిత్స మధ్యలో నిలిపివేసిన వారిని తిరిగి వైద్య సేవల్లోకి తీసుకురావడంతో పాటు, వైరల్ లోడ్ నియంత్రణ మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
అన్ని విభాగాల సమన్వయంతో మెరుగైన సేవలు
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (TG SACS) ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. వంశీకృష్ణ, ఎయిడ్స్ మరియు లెప్రసీ ప్రోగ్రామ్ అధికారి, JHPIEGO సంస్థకు చెందిన ప్రివెన్షన్ అడ్వైజర్ ఆంథోనీ రెడ్డి, ట్రీట్మెంట్ అడ్వైజర్ డా. శాంతి, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్ అశోక్, DAPCU జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సుధాకర్‌తో పాటు ART, ICTC కేంద్రాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో హెచ్ఐవీ పరీక్షలు, చికిత్స సేవలను అనుసంధానించడం ద్వారా గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించవచ్చని అధికారులు తెలిపారు. హెచ్ఐవీపై అవగాహన పెంపొందిస్తూ, పరీక్షల నుంచి చికిత్స వరకు నిరంతర సేవలు అందించేందుకు జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

