కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవ చూపాలని నారాయణపేట (Narayanpet) జిల్లా కలెక్టర్ సీహెచ్.ప్రియాంక సూచించారు. శుక్రవారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం ఎల్‌డీఎం విజయ్ కుమార్ అధ్యక్షతన జరగగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, ఎం.ఎస్.ఎం.ఈ, విద్య, స్వయం సహాయక సంఘాల, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరుపై సమీక్ష జరిపారు. సిబిల్ స్కోర్ ప్రమాణంగా పరిగణిస్తూనే.. రైతులు, విద్యార్థులు , స్వయం ఉపాధి అంశాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశించారు.
రూ.4,524.78 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక..
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ముద్ర యోజన తదితర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోపు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రియాంక బ్యాంకర్లను కోరారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,524.78 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్నివిడుదల చేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్‌డీఓ శ్రీకాంత్, ఎస్బీఐ ఏజీఎం పవన్ కుమార్, నాబార్డ్ డీడీఎంలు మహేందర్, శీలా, డీఆర్డీఏ వెంకట్ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి అబ్దుల్ ఖలీల్, హార్టికల్చర్ అధికారి సాయిబాబా, పశు సంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

