కలం, నారాయణ పేట : మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అర్హులైన భూ యజమానులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Collector Priyanka) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లతో కలిసి ఎంఎన్‌కేఎల్ (MNKL) ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నారాయణపేట, దామరగిద్ద, కోస్గి మండలాల్లో గుర్తించిన గ్రామాల్లో భూసేకరణ సర్వేను మరింత వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దామరగిద్ద మండలంలోని విఠలాపూర్, గదప, కాన్‌కూర్తి, అన్నాసాగర్, ఉలిగుండం గ్రామాల్లో సర్వే, భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందో అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. అలాగే కోస్గి మండలంలోని నాచారం, తోగాపూర్ గ్రామాల సర్వే పూర్తయిందా లేదా అని సర్వే ల్యాండ్ ఏడీని ప్రశ్నించారు. ఈ రెండు గ్రామాల్లో సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ముశ్రీఫా, మీర్జాపూర్ గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వేను వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే చంద్రవంచ, ముక్తిపాడ్, చెన్నారం గ్రామాల్లోనూ వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆయా గ్రామాల సర్పంచులతో మాట్లాడి భూసేకరణ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రమేష్‌కు కలెక్టర్ సూచించారు. భూసేకరణలో అర్హులైన భూ యజమానులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే శనివారం ఆయా గ్రామాల్లో సర్వే, భూసేకరణ పురోగతిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు.

