కలం, వెబ్ డెస్క్: మంచిర్యాల (Mancherial) జిల్లా కోటపల్లి (Kotapally) మండల కేంద్రంలో వింతైన, ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. తనతో కాపురానికి రావడం లేదనే కోపంతో ఓ భర్త ఏకంగా భార్య ముక్కును కొరికిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మల్లంపేటకు చెందిన మణిచందర్ అనే వ్యక్తికి, తొమ్మిదేళ్ల క్రితం మమత అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అయితే, మద్యానికి బానిసైన మణిచందర్ అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. గత నాలుగేళ్లుగా అతను తనను వేధిస్తున్నాడని మమత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులను భరించలేక మమత ఇటీవల తన పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు మణిచందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మమత ఇంటికి వెళ్లాడు.
ఈ విషయమై ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో మణిచందర్ మమత తండ్రి అయిన నారాయణపై దాడికి యత్నించాడు. ఆ దాడిని అడ్డుకోవడానికి మమత ప్రయత్నించగా, ఆగ్రహంతో ఊగిపోయిన మణిచందర్ ఆమె ముక్కును బలంగా కొరికాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మమతను చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు.

