కలం, నకిరేకల్: ప్రజలకు సమగ్రమైన, ఆదర్శవంతమైన చట్టాన్ని అందించాలనే అత్యున్నత లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ‘భూభారతి’ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) స్పష్టం చేశారు. బుధవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే భూభారతి చట్టంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
ధరణి వ్యవస్థపై ఎమ్మెల్యే విమర్శలు
గత పాలకుల హయాంలో తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ ప్రజలకు ఎంతమాత్రం ఉపయోగపడలేదని, పైగా ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. గతంలో నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు పడ్డారో, ధరణి వ్యవస్థ వల్ల కూడా రైతులు, భూ యజమానులు అదే రీతిలో తీవ్ర నష్టాన్ని, వేధింపులను ఎదుర్కొన్నారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి గతంలో ఉండేదని గుర్తుచేశారు.
పెండింగ్ దరఖాస్తులపై దృష్టి
భూ యజమానులకు, రైతులకు భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ నమ్మకాన్ని పునరుద్ధరించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో రైతులు ఇచ్చిన వేలాది దరఖాస్తులను పక్కన పడేశారని, ప్రజా ప్రభుత్వం అవన్నీ పరిశీలించి సమస్యలను వేగంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలు, రైతుల ప్రభుత్వమని.. వారి భూ హక్కులను కాపాడి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని చెప్పారు. భూ భారతి చట్టం ద్వారా తెలంగాణలోని భూసమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపి, రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు.

