కలం, మెదక్ బ్యూరో: నారాయణఖేడ్ (Narayankhed) నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ఈరోజు నారాయణఖేడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి, జీవన ప్రమాణాలకు డోకా ఉండదన్నారు. నిధుల కొరత లేకుండా చూస్తూ, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యత క్రమంలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

