న్యాయం కోసం అధికారుల చుట్టూ మహిళ ప్రదక్షిణలు.. చివరకు!

​కలం, ఖమ్మం బ్యూరో: ​సమస్యలు పరిష్కరించాల్సిన అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా న్యాయం దక్కకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన (Suicide Attempt) ఘటన భద్రాచలం (Bhadrachalam) వంతెనపై తీవ్ర కలకలం రేపింది. అయితే, అక్కడే ఉన్న స్థానికులు, వాహనదారులు సమయస్ఫూర్తితో స్పందించి ఆమెను కాపాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

​ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొల్లమూడి శైలజ మంగళవారం భద్రాచలం వద్దనున్న గోదావరి వంతెనపైకి చేరుకుని, ఒక్కసారిగా నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. వంతెనపై వెళ్తున్న బాటసారులు ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై ఆమెను అడ్డుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం స్థానికులు అందించిన సమాచారంతో బూర్గంపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, శైలజను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

​తనకు జరిగిన అన్యాయం గురించి బాధితురాలు పోలీసు స్టేషన్‌లో కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేసింది. గొల్లపూడి రమేష్ అనే వ్యక్తి తమకు చెందిన ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపించింది. ఆక్రమణను ప్రశ్నించినందుకు ఆగ్రహంతో తన భర్తపై వరుసగా పలు అక్రమ కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపింది.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోలేదని, గత ఐదు నెలలుగా న్యాయం కోసం స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయింది. వేధింపులు తట్టుకోలేక, ఇక న్యాయం దక్కదనే నిరాశతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>