కలం, వనపర్తి: జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్, రైతులు చేపట్టిన ఆందోళనలు (BRS Jurala Protest) ఫలించాయని ఆ పార్టీ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. 8 రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జూరాల ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
నాయకులను గృహనిర్బంధం చేసినప్పటికీ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు జూరాల వైపు తరలివెళ్లారని అశోక్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం జూరాల నుంచి నీటిని విడుదల చేయడానికి అంగీకరించడం బీఆర్ఎస్, రైతుల విజయమని అన్నారు. రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిరంజన్‌రెడ్డి వ్యూహంతోనే..
జూరాల ఆయకట్టు రైతుల సమస్యలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారని అశోక్ (Nandimalla Ashok) తెలిపారు. అనంతరం కేటీఆర్ పెబ్బేరు మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారని, ఆయన పిలుపుతో రైతులు జూరాల ముట్టడికి తరలివచ్చారని పేర్కొన్నారు. జూరాలకు వరద నీరు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా నీటిని శ్రీశైలం వైపు తరలించారని అశోక్ ఆరోపించారు.
ప్రస్తుతం జూరాలలో 8.8 టీఎంసీల నికర జలాలు ఉన్నాయని, తాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీలు రిజర్వు చేసి మిగిలిన నీటిని ఆయకట్టు పంటలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారాబందీ ప్రకారం నీటిని విడుదల చేసి వానాకాలం పంటలను కాపాడాలని కోరారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉన్నందున కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి నీటిని పొందే ప్రయత్నం చేయాలని సూచించారు.
గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో నీటి లభ్యతపై లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదించాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు ఆయన తీసుకున్న చొరవ అభినందనీయమని నందిమల్ల అశోక్ పేర్కొన్నారు.

