నల్లగొండలో ఉద్రిక్తత.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ అరెస్టుల పర్వం..!

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda ) జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజకీయ వేడి రాజుకుంది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ (ఇందిరమ్మ) ఇళ్ల పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు సిద్ధమైన సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

నల్గొండలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ ఇళ్ల పంపిణీ జాబితాలో భారీగా అక్రమాలు జరిగాయని సీపీఎం ఆరోపించింది. కొందరు కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని, అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకు పట్టాలు కట్టబెడుతున్నారని నాయకులు మండిపడ్డారు. ఈ పంపిణీకి నిరసనగా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని సీపీఎం హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

సీపీఎం ఆఫీసులో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై ఆగ్రహం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి అడ్డంకులు వస్తాయనే అనుమానంతో నల్గొండలోని సీపీఎం కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సీపీఎం జిల్లా నాయకుడు ఎండి సలీంతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీపీఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన తెలపకముందే ఆఫీసులోకి వచ్చి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకోవడంపై నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. “స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేసిన పవిత్రమైన రోజున, ప్రజల గొంతు నొక్కడం అత్యంత దారుణం. అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరడమే మేము చేసిన నేరమా? స్వాతంత్ర్య ఫలాలు పేదలకు కాకుండా అధికార పార్టీ లీడర్ల జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా?” అని ప్రశ్నించారు. పోలీసులు తీవ్రంగా అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అరాచక పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసిన సీపీఎం నేతలు, స్వాతంత్ర్య దినోత్సవం నాడే తమపై జరిపిన ఈ అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>