కలం, నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన ఈ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు (Nalgonda Police) ప్రాణాలకు తెగించి అరెస్టు చేశారు. జూన్ 30న ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిందితుడి డీసీఎం వాహనాన్ని పోలీసులు అడ్డుకోగా, నిందితుడు భూస్మి శ్రీకాంత్ ఒక్కసారిగా కిందికి దూకి ఇనుప రాడ్‌తో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై ప్రాణాంతక దాడికి తెగబడ్డాడు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు తొలుత 3 రౌండ్లు గాలిలోకి హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు లొంగకపోవడంతో, ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడికి వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
ప్రధాన నిందితుడు భూస్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజుపై గతంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మర్డర్ కేసుతోపాటు 30కి పైగా కేసులు ఉన్నాయి. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మరో 40కి పైగా చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. దర్యాప్తులో భాగంగా రెండు రాష్ట్రాల్లోని 10 నేరస్థలాల్లో ఇతని వేలిముద్రలు లభ్యమయ్యాయి. అత్యంత ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు యం. జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్‌స్పెక్టర్ పీ.ఎన్.డి. ప్రసాద్, ఎస్.ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బృందాన్ని జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు.

