కలం, నల్లగొండ బ్యూరో: ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పాటు తాగు నీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Chandrashekhar) అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం కింద రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకుగాను అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని, నర్సరీలలో పెంచుతున్న మొక్కల గురించి గ్రామసభలలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టర్ శాలిగౌరారం మండలంలోని వల్లాల, అడ్లూరు గ్రామాల్లో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను,ప్రభుత్వ పనులను తనిఖీ చేశారు.
వల్లాల గ్రామంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వనమహోత్సవం నర్సరీని తనిఖీ చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు, వాటి రకాలు, గ్రామ పంచాయతీ ద్వారా వాన కాలంలో నాటనున్న మొక్కల టార్గెట్, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, గృహాలకు పంపిణీ చేసే మొక్కలు, జియో ట్యాగింగ్ తదితర వివరాలన్నింటిని ఏపీఎం శంకరయ్య, ఏపీవో జంగమ్మ, వన సేవకుడు తంబయ్య ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి గ్రామస్తుల ఉదయం నడకకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వల్లాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఫిష్ పాండ్ తవ్వుతుండగా తనిఖీ చేశారు.
ఉపాధి హామీ పథకం కింద 6 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 3000 పని దినాలు కల్పించేందుకు ఫిష్ పాండ్ పనులు చేపట్టారు. కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతమంది వస్తున్నారని? పని ఎప్పుడు ప్రారంభించారని? మెజర్మెంట్ ఎంత తీసుకున్నారని? అడిగారు. ఎండలకు పని చేయలేకపోతున్నామని కూలీలు జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. ఉదయం వచ్చి పని చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తక్కువ పని చేస్తే తక్కువ వేతనం వస్తుందని, అలా కాకుండా ఎక్కువ పనులు చేసుకున్నప్పుడు ఎక్కువ వేతనం వచ్చేలా చూడాలని ఫిష్ పాండ్‌తో పాటు ఫీడర్ ఛానల్, ఇతర పనులు చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాస్టర్, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు.

