ఢిల్లీకి చేరిన నల్లగొండ రోడ్డు పంచాయితీ!

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) బైపాస్ రోడ్డు.. ఇప్పుడు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. రాజకీయ రణక్షేత్రం. అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్, నాణ్యత అస్త్రంతో విరుచుకుపడుతున్న బీజేపీ మధ్య యుద్ధం ఢిల్లీకి చేరింది. అటు సొంత నేతలే కాంట్రాక్టర్లుగా ఉండటంతో నోరు మెదపలేక బీఆర్ఎస్ సతమతమవుతుంటే.. మధ్యలో రూ.700 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు జిల్లా (Nalgonda) రాజకీయాల్లో రోడ్డు సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం నల్లగొండ రాజకీయాలన్నీ 14 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు చుట్టూనే తిరుగుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్‌గా మారింది. నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు పానగల్‌ ఛాయసోమేశ్వరస్వామి ఆలయం నుంచి పానగల్, మర్రిగూడ, హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా ఎస్‌ఎల్‌బీసీ మెడికల్‌ కళాశాల వరకు దాదాపు రూ. 514 కోట్ల వ్యయంతో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సాగుతున్న ఈ పనుల్లో నాణ్యత లోపించిందని బీజేపీ ఆరోపించడంతో అసలు వివాదం మొదలైంది.

నాణ్యత ప్రమాణాలపై బీజేపీ పోరు..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మట్టి వాడుతున్నారని, కాంట్రాక్టర్ల లబ్ధి కోసం నాణ్యతను బలి ఇస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఇష్యూను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఏకంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లడం గమనార్హం. రోడ్డు నిర్మాణ పనుల్లో మొరానికి బదులు చెరువు మట్టి వాడటంతో నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తున్నాయి. నగర సమీప చెరువుల్లో అక్రమంగా నల్లమట్టిని తరలిస్తూ రోడ్డుకు ఉపయోగిస్తున్నారు. దీంతో రోడ్డు కుంగి పోయే ప్రమాదం ఉంది. మరోవైపు నీళ్లు చల్లకుండానే ఆ మట్టిపై రోలర్‌తో తొక్కించి చదును చేస్తున్నారు. నిజానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టగా తీసుకున్నారు. అయితే బీజేపీ చేస్తున్న ఫిర్యాదులు, పనుల అడ్డగింత అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకున్నారన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తోసిపుచ్చుతున్నాయి. ఇదిలావుంటే.. బైపాస్‌ రోడ్డులో ఒక ప్లైఓవర్, మూడు అండర్‌పాస్‌ బ్రిడ్జీలు, 30 ప్రాంతాల్లో కల్వర్టులు, రెండు మైనర్‌ బ్రిడ్జీలు, 14 కి.మీ మేర రెండు వైపులా ప్రహారీ, వరద కాల్వల నిర్మాణాలున్నాయి. వాటి కాంక్రీటు పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ మౌనం వెనుక అసలు మతలబు ఇదేనా?

ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం ఈ రోడ్డు కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ఒకప్పటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కావడమేనని సమాచారం. సొంత పార్టీకి చెందిన వారే కాంట్రాక్టర్ కావడంతో ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా బీఆర్ఎస్ నేతలు గప్ చుప్ అయ్యారు. వాస్తవానికి ఈ బైపాస్ రోడ్డు విషయంలో సామాన్యుడి నుంచి మేధావుల వరకు అంతా విమర్శలను ఎక్కుపెట్టారు. అసలు బైపాస్ నిర్మాణమే సొంత ప్రయోజనాల కోసం చేపట్టారంటూ ఆరోపణలు లేకపోలేదు. నిర్మాణంలో నాణ్యత లోపమే కాదు.. అసలు బైపాస్ రూట్ ఎంపికే తప్పు అని వాదిస్తుండడం గమనార్హం. మొత్తానికి నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణం కేవలం సిమెంట్, కాంక్రీట్ వ్యవహారంలా కాకుండా.. రాజకీయ పైచేయి సాధించే అస్త్రంగా మారింది. నిరసనలు, ఫిర్యాదుల మధ్య ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయి? ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>