కలం, నకిరేకల్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ (Nalgonda) జిల్లా పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్ మండలాలకు చెందిన 256 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు నకిరేకల్ నియోజకవర్గానికి దాదాపు రూ. 23 కోట్ల విలువైన CMRF చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కడపర్తి సమీపంలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
నకిరేకల్ పట్టణంలో ‘ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువు కోసం ఉచిత పాఠశాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతలో కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. దీనికితోడు రెండో విడత కింద మరో 2,000 ఇండ్లు మంజూరయ్యాయని, వీటిని పూర్తిగా అర్హులైన పేదలకే అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి సబ్సిడీలు, సంక్షేమ పథకాల ఫలాలు అందలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు. పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

