‘మూసీ’ ఇసుక త‌వ్వ‌కాల‌పై ప్ర‌జా సంఘాల ఆగ్ర‌హం

‎కలం, నకిరేకల్ : మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇసుక మైనింగ్‌ (Sand Mining)ను తక్షణమే నిలిపివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ పర్యావరణం, భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు, తీరప్రాంత గ్రామాల జీవనాధారాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ శాలిగౌరారం మండల కేంద్రంలోని జె.ఎం.జె. స్కూల్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సాగర్, బీఆర్ఎస్‌కేవీ మండల అధ్యక్షుడు మామిడి రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు తోట వినోద్ కుమార్, కొప్పుల నర్సింహా, దళిత సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.

మూసీ నదికి ఇరువైపులా ఉన్న చిత్తలూరు, వంగమర్తి, ఇటుకలపహాడ్, తుడిమిడి గ్రామాలతో పాటు 20కి పైగా గ్రామాలు నదీ కోతలు, భూగర్భ జలాల తగ్గుదల, వ్యవసాయ భూములను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని నాయకులు పేర్కొన్నారు. నదీగర్భంలో భారీ యంత్రాలతో లోతుగా ఇసుక తవ్వకాలు చేపడితే నది సహజ ప్రవాహ స్వభావం దెబ్బతిని, తీర ప్రాంతాలు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బావులు, బోర్లలో నీటి మట్టాలు అడుగంటి రైతాంగం తీవ్ర నష్టాల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇసుక అనేది కేవలం నిర్మాణ రంగానికి అవసరమైన వనరు మాత్రమే కాదని, నదీ వ్యవస్థలో నీటి నిల్వలు, భూగర్భ జలాల పునరుద్ధరణ, పర్యావరణ సమతుల్యతను కాపాడే సహజ సంపద అని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఇసుకను విచ్చలవిడిగా తవ్వి తరలించడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి, సాగునీటి సమస్యలు ఏర్పడి తీవ్ర వ్యవసాయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలను, పర్యావరణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు.

మూసీ పరిరక్షణ సమితి ఏర్పాటుకు అడుగులు..

‎మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల ప్రతిపాదనలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చి నదీ పర్యావరణాన్ని, రైతుల జీవనాధారాలను కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు. నదులు, వాగులు, వ్యవసాయ భూములు, గ్రామాల భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘మూసీ పరిరక్షణ సమితి’ ఏర్పాటు కోసం తాత్కాలిక కో-ఆర్డినేషన్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వేముల శంకర్, డివిజన్ నాయకులు రావుల లింగయ్య, ఏఐకేఎంఎస్ సహాయ కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సిలువేరు జానయ్య, జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, ఏనుగు సత్తిరెడ్డి, బీఆర్ఎస్‌వీ నాయకుడు రాచకొండ గణేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>