థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం

క‌లం, స్పోర్ట్స్: మధ్యప్రదేశ్ మహిళల ఏసియన్ ఛాంపియన్ షిప్‌ (Womens Asian Champions Trophy) 9వ అడిషన్‌లో భారత్ అదరగొట్టింది. థాయ్‌లాండ్‌ను 7–0 తేడాతో చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. థాయ్‌లాండ్‌తో పోరులో ప్రారంభం నుంచే దూకుడు కనబరించింది. వరుస గోల్స్‌తో గేమ్ మొత్తం ఆధిపత్యం చూపింది. దీపిక హ్యాట్రిక్‌తో మెరవగా.. నవనీత్ కౌర్ రెండు గోల్స్‌తో ఆకట్టుకుంది.

భోపాల్‌లోని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన టీమిండియా ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను నవనీత్ కౌర్ గోల్‌గా మలిచింది. 10, 11వ నిమిషాల్లో దీపిక వరుసగా రెండు గోల్స్ చేసింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో క్వార్టర్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగించింది. 28వ నిమిషంలో ముంతాజ్ ఖాన్ మరో గోల్ సాధించింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 4-0తో నిలిచింది.

మూడో క్వార్టర్‌లో సునెలిత టొప్పో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. భారత్ ఆధిక్యం 5-0కి చేరింది. చివరి క్వార్టర్‌లో దీపిక తన హ్యాట్రిక్ పూర్తి చేసింది. 56వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించింది. అదే నిమిషంలో నవనీత్ మరో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. దీంతో భారత్ 7-0తో భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి తొమ్మిది పాయింట్లు సాధించింది. +11 గోల్ తేడాతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ కూడా తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో నవంబర్ 24న చైనాతో తలపడనుంది. సోమవారం టోర్నీకి విశ్రాంతి దినంగా ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>