కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, మాధవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ నగర శాఖ ఉపక్రమంలో భాగంగా నగర స్థాయి బాల స్వయంసేవకుల ఖో-ఖో పోటీలు (Kho-Kho Tournament) ఆదివారం ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరంలో బాల శాఖల విస్తరణ, బలోపేతం లక్ష్యంగా నగరంలోని అన్ని శాఖల బాల స్వయంసేవకులకు ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో నగరంలోని 15 బస్తీలు, 15 శాఖల నుంచి మొత్తం 22 జట్లు, సుమారు 250 మంది బాల క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
బాల స్వయంసేవకుల్లో జట్టు నాయకత్వం, పోరాట పటిమ, క్రీడా నైపుణ్యం, సమిష్టి భావనను పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసం, పట్టుదల, దృఢ సంకల్పాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ భానుచందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్‌కు బానిసలవుతున్న తరుణంలో 250 మంది బాలలు మైదానంలోకి వచ్చి దేశీయ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు.
హోరాహోరీగా సాగిన పోటీల్లో హనుమాన్ నగర్ శాఖ ప్రథమ బహుమతి సాధించగా, సీతారాంపూర్ శాఖ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీలను విజయవంతం చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్ దురిశెట్టి నిరంజనాచారి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

