కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి కనీస సాయమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి లాభం చేకూరలేదని అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. రాజకీయంగా ప్రశ్నించడం సహజమని, కానీ శవ రాజకీయం చేయడం తగదని బండి సంజయ్‌కి సూచించారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాం
ఆర్టీసీ కార్మికుల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 30 రోజులు గడిచినా ఆర్టీసీ సమస్యను పరిష్కరించలేదని.. తమ ప్రభుత్వం మాత్రం గంటల వ్యవధిలోనే కార్మికులకు అండగా నిలిచిందన్నారు. చర్చల సమయంలో కూడా ప్రత్యర్థి పార్టీల రాజకీయ దురుద్దేశం బయటపడిందని పేర్కొన్నారు. శవ రాజకీయం, మత రాజకీయం చేయడం బీజేపీకి అలవాటైందని ఆరోపించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీతో రాష్ట్రానికి ప్రయోజనమేంటి?
బీజేపీతో తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఏమిటని నాయిని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీజేపీ పరిస్థితి మరింత దిగజారుతుందని, “డబుల్ ఇంజన్” కాదు, ఉన్న ఇంజన్ కూడా పోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడితే ప్రజలు అంగీకరించరని, గతంలో వారి పాలనలో ఆర్టీసీ ఆస్తులు అమ్ముకున్నారని గుర్తుచేశారు. వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఏ సమస్య వచ్చినా సీఎం పరిష్కరిస్తారు
గత 20 ఏళ్లుగా జిల్లాను అభివృద్ధిలో వెనక్కి నెట్టిన నాయకులు మళ్లీ కపట వేషాలతో ముందుకు వస్తున్నారని హెచ్చరించారు. ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Also: కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
Follow Us On: WhatsApp

