కలం, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న బీసీ రక్షణ చట్టం (BC Protection Act)పై నేడు విజయవాడలో కీలక సమావేశం జరిగింది. మంత్రి సవిత అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థ సారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో ఈ బీసీ చట్టం ఉంటుందని చెప్పారు. రెండేళ్ల పాటు కసరత్తు చేసి చట్టం రూపొందించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదని, ఏపీలోనే మొదటి సారి తీసుకొస్తున్నామని అన్నారు. ఈ చట్టాన్ని రూపొందించేందుకు పలు సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముసాయిదాకు తుది రూపు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కులాలు, వృత్తుల పేరుతో దూషించకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏ చట్టం కూడా అమలు కాలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి చట్టం అమలు అవుతుందని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జగన్ బీసీలకు రిజరర్వేషన్లు తగ్గించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై కోర్టులో టీడీపీ పోరాడిందని, అయినా అప్పటి ప్రభుత్వం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.

