పాలమూరు ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం: ఎంపీ మల్లు రవి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ నగరంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీతోపాటు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ (MP Mallu Ravi) మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ నిధులు రాబడుతానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తే, బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాలు కలిసి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నాడు పాలమూరు వలసల జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, కానీ ప్రస్తుతం అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే 30 వేల కోట్లు కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ నాయకులు సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఫరూఖ్ హుస్సేన్, జేఏసీ నాయకులు బెక్కెం జనార్ధన్, వీరబ్రహ్మాచారి, సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు జగపతి రావు పాల్గొన్నారు.

Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>