కలం, వెబ్ డెస్క్: మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25-27 తేదీల్లో హైదరాబాద్ నిర్వహించ తలపెట్టిన ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు (Nasha Mukt Bharat Yatra) టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) మద్దతు ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కొరారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఇలాంటి కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు మేరకు 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ ను నిర్మించాలని హోంశాఖ మంత్రి అమిత్ షా ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (Nasha Mukt Bharat Yatra)ను చేపడుతున్నట్లు వెల్లడించారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువత, తల్లిదండ్రులు, ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

