కొండా ఇష్యూ.. ఓవర్ టు బెంగళూరు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ వివాదం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే, సుష్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరిస్తూ లేఖ రాశారు. దీంతో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా మంత్రి ఈ విధంగా సమాధానం చెప్పడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్ లు తీవ్రంగా స్పందించారు.

ఏకంగా సీఎంపైనే సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కొండా సరేఖ ఖండించకపోవడంతో వాళ్లంతా భగ్గుమన్నారు. సీఎల్పీలో భేటీ అయి ఆమెపై దిక్కార స్వరాన్ని వినిపించారు. వెంటనే సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ క్రమ శిక్షణ కమిటీ స్పందించి టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు నివేదిక అందజేశారు. చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ అధిష్ఠానానికి క్రమశిక్షణ కమిటీ నివేదికను అందజేయాలని కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించారు.

ఈ క్రమంలో మంత్రి సురేఖ భర్త కొండా మురళి రంగంలోకి దిగారు. సురేఖకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ రాయబారిగా మారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బుధవారం ప్రజాభవన్ లో కలిశారు. దీంతో కూతురు విషయంతో పాటు సురేఖపై వస్తున్న ఊహాగానాలపై మాట్లాడేందుకు భట్టిని కలిశారనే ప్రచారం నడుస్తోంది. కానీ, తాను మాత్రం ఒక బిల్లుకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు డిప్యూటీ సీఎంను కలిశానని కొండా మురళి చెప్పుకొస్తున్నారు. అయితే, సురేఖ వివాదం గురించే భట్టితో చర్చించడానికే ప్రజాభవన్ కు వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

బెంగళూరుకు భట్టి.. ఖర్గేతో భేటీ..!

కొండా మురళి సమావేశం అనంతరం కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి కలిసినట్లు తెలుస్తోంది. కొండా మురళి వెళ్లిపోయిన తరువాత సీఎంతో భేటీ అయి కొండా సురేఖ ఇష్యూతో పాటు చిన్నారెడ్డిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను కలిసి వివరించాలని రేవంత్.. భట్టికి సూచించారని తెలుస్తోంది. అయితే, ఖర్గే బెంగళూరులో ఉండడంతో అక్కడికే రావాలని చెప్పగా భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ భేటీలో క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఖార్గేకు భట్టి వివరించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>