కలం, నిర్మల్: సన్నబియ్యాన్ని ప్రభుత్వం సూచించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) రాజేందర్ (DSO Rajender) హెచ్చరించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు బియ్యం దుకాణాలను (Rice Shops) ఆయన తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ సూచించిన ధరల ప్రకారమే సన్నబియ్యం విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.
బియ్యం కృత్రిమ కొరత సృష్టించడం, నిల్వలను దాచిపెట్టడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్ఓ సాగర్, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

