కలం, సూర్యాపేట: మురసు తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సూర్యాపేట (Suryapet) వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (బుధవారం) మార్కెట్ యార్డు (Market Yard) కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల రైతులు పండించిన పంట ఉత్పత్తులు తడిసి నష్టపోకుండా ఉండేందుకే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు.
మార్కెట్కు సెలవు ప్రకటించినందున, రైతు సోదరులందరూ గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మార్కెట్ యార్డుకు తరలించవద్దని కోరారు. రైతులు తమ ఉత్పత్తులను ఎవరి ఇండ్ల వద్దనే వారు సురక్షితంగా భద్రపరుచుకోవాలని సూచించారు. తమ వద్దకు, దుకాణాల ముందుకు వచ్చే రైతులకు ఈ సమాచారాన్ని వెంటనే చేరవేయాలని కమిషన్ దారులను ఆదేశించారు.
ఎవరూ కూడా రేపు సరుకులు తీసుకురాకుండా రైతులకు తగిన సూచనలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా కమిషన్ దారులు ఉద్దేశపూర్వకంగా సరుకులు తెప్పించి, మార్కెట్ కమిటీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారి పేర్లను ‘ఈ-నామ్’ నుండి తొలగించడంతో పాటు తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిక జారీ చేశారు.

