ఈఆర్సీ హియరింగ్‌లో ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

‎కలం, భువనగిరి: తెలంగాణలో విద్యుత్ వినియోగం, పవర్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ రంగానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలందరికీ స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) అన్నారు. మంగళవారం నిర్వహించిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) పబ్లిక్ హియరింగ్‌కు హాజరైన ఆయన, విద్యుత్ రంగానికి సంబంధించి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వ్యయభారాలపై ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్ల పాటు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి ఈఆర్సీ హియరింగ్‌కు వచ్చి అవాస్తవాలు మాట్లాడి వెళ్లిపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. తెలంగాణ ట్యాగ్ లైన్ అయిన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాధించుకున్న రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 20,000 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరిందని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి, కొత్త పెట్టుబడులు రావడానికి నాణ్యమైన విద్యుత్ అత్యంత కీలకమని, పీక్ డిమాండ్ పెరగడం రాష్ట్ర ఆర్థిక పురోగతికి మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీని (హరిత విద్యుత్) ప్రోత్సహించే దిశగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు, తప్పుడు నిర్ణయాలకు పాల్పడిందని ఎంపీ ఆరోపించారు. పాతబడిన ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’ని వాడటం వల్లే ఈ ప్లాంట్ల నిర్మాణ ఖర్చు విపరీతంగా పెరిగిందన్నారు. బొగ్గు, నీటి వనరులు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో యాదాద్రి ప్లాంట్‌ను నిర్మించారని మండిపడ్డారు. దీనివల్ల రాబోయే 40 ఏళ్ల వ్యవధిలో రాష్ట్ర ఖజానాపై సుమారు లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని లెక్కలతో వివరించారు. యాదాద్రి ప్లాంట్‌ను కేవలం ‘G9’ క్వాలిటీ బొగ్గు వాడేలా నిర్మించారని, ఈ రకం బొగ్గు విదేశాల్లో మాత్రమే లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విదేశాల నుంచి, కోల్ ఇండియా నుంచి బొగ్గును రప్పించి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో కోయగూడెం, సత్తుపల్లి వంటి విలువైన బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించారని ఎంపీ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు క్వాలిటీ విద్యుత్ అందించడమే కాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>