కలం, వెబ్ డెస్క్: మార్కెట్‌లో కల్తీ ఆహారం పెరిగిపోతోంది. ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోంది. తయారు చేసే ఫుడ్ మొదలు చెట్టుకు కాసే పళ్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబై (Mumbai)లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో ఇద్దరు వ్యాపారులు పండ్లపై ఎలుకల మందు రాసిన వీడియో బయటపడటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బుధవారం ఓ స్థానికుడు వీడియో ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు పక్కనే సదరు వ్యాపారుల దుకాణాన్ని తనిఖీ చేసిన పోలీసులు, అక్కడ “రాటోల్” అనే ఎలుకల మందును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో యెల్లో ఫాస్ఫరస్ వంటి విషపూరిత రసాయనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అనంతరం ఆ స్టాల్‌ను సీజ్ చేశారు.
ఈ ఘటనలో పోలీసులు మనోజ్ సంగంలాల్ కేశర్వాణి, రాహుల్ సదన్‌లాల్ కేశర్వాణిలను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మలాడ్ వెస్ట్‌లోని రాజన్‌పాడా ప్రాంతానికి చెందినవారు. అరెస్ట్ అనంతరం బోరివలి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వైరల్ అయిన వీడియోలో ఒక వ్యాపారి అరటిపండ్లపై క్రీమ్‌లా కనిపించే పదార్థాన్ని రాస్తూ కనిపించాడు. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. అయితే విచారణలో రాత్రిపూట ఎలుకలు పండ్లను పాడు చేయకుండా ఉండేందుకు ఆ మందు రాసినట్లు వ్యాపారులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి విషపూరిత పదార్థాలు పండ్లపై రాయడం వల్ల వాంతులు, కడుపునొప్పి మొదలు ప్రాణాపాయం కూడా కలగవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేసి కల్తీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also: రైల్వే టికెట్ క్లర్క్‌కి బుద్ధి చెప్పిన యువతి.. ఉద్యోగమే ఊడిపోయింది!
Follow Us On: Instagram

