ఆంధ్ర మహాసభ చరిత్రలో తొలిసారిగా క్లీన్ స్వీప్.. రికార్డు స్థాయిలో పోలింగ్

కలం, నిర్మల్: ముంబై (Mumbai) లోని దాదర్‌లో ఉన్న ది ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా – 2026 ఎన్నికల్లో ‘మన ప్రగతి ప్యానల్’ (Mana Pragathi Panel) అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మన ప్రగతి ప్యానల్, సిద్ధి సాయి ప్యానల్ మధ్య పోటీ నెలకొనగా.. ఓటర్లు మన ప్రగతి ప్యానల్‌కు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. దీంతో ఆంధ్ర మహాసభ చరిత్రలో తొలిసారిగా ఒకే ప్యానల్ అన్ని స్థానాల్లో విజయం సాధించిన ఘనత నమోదైంది.

రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఎన్నికల్లో మొత్తం 4,400 మంది ఓటర్లకు గాను 1,585 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆదివారం అర్ధరాత్రి వరకు, సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది.

కౌంటింగ్ అనంతరం ఫలితాలను ప్రకటించగా మన ప్రగతి ప్యానల్ అభ్యర్థులందరూ విజయం సాధించారు. ట్రస్టీ సభ్యులుగా నడిమెట్ల ఎల్లప్ప, రాపెల్లి పరమేశ్వర్, శెకెల్లి రాములు, వాసాల శ్రీహరి ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యాపురం వెంకటేశ్వర్, కోశాధికారిగా తాళ్ల నరేష్, ఉపాధ్యక్షులుగా కుంచన బాలకిషన్, భోగ సదానంద్, డాక్టర్ అల్లే సంజయ్, సంయుక్త కార్యదర్శులుగా జక్కని శ్రీనివాస్, తాటికొండ మోతిరాం, డాక్టర్ గుజ్జెటి కృపేందర్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా అలిశెట్టి జనార్ధన్, పల్లె శ్రీనివాస్, ప్రత్యూష, మల్లయ్య, చాప ముఖేష్, చిలివేరి చంద్రశేఖర్, గణేష్, పొన్న శ్రీనివాస్, సుంక ప్రభాకర్ విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబైలోని వివిధ ప్రాంతాలతోపాటు భీవండి, నవీ ముంబై, తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జీవిత సభ్యులు తరలివచ్చారు. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొండారెడ్డి మినహా.. అంతా తెలంగాణ వారే..

1928లో ముంబైలో స్థిరపడిన తెలుగువారి కోసం ప్రారంభమైన ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. తొలినాళ్లలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి ప్రాతినిధ్యం అధికంగా ఉండగా.. కాలక్రమేణా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా సంస్థలో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2026 ఎన్నికల్లో విజయం సాధించిన మన ప్రగతి ప్యానల్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన మాదిరెడ్డి కొండారెడ్డి మినహా మిగిలిన 21 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడం ప్రత్యేకతగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>