మురసు తుఫాన్ అలర్ట్: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ (Murasu Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు దిగువ జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారుల అంచనాలపై ఆయన సమగ్రంగా చర్చించారు. ఇటీవల అర్నబ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుని చాలా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వచ్చాయని తెలిపిన సీఎం.. రాబోయే మురసు తుఫాన్ ప్రభావాన్ని కూడా అదే రీతిలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ఆదేశించారు.

ఈ భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్, పులిచింతల వంటి ప్రధాన ప్రాజెక్టుల్లోకి సుమారు 13 నుంచి 15 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దక్షిణ కోస్తాంధ్ర, అలాగే రాయలసీమ బేసిన్లలోని జలాశయాలను నింపేలా పక్కా ప్రణాళికతో సమర్థవంతమైన నీటి నిర్వహణను చేపట్టి, చెరువులను జలకళతో నింపాలని సూచించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం తదితర జిల్లాల్లో నీటి నిల్వలను సమర్థంగా నిర్వహించాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా క్షేత్రస్థాయి యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హుకుం జారీ చేశారు.

అంతకుముందు మురసు తుఫాన్ (Murasu Cyclone) ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తమిళనాడు ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. విద్యుత్ పోల్స్ దెబ్బతింటే పునరుద్ధరణకు సిబ్బంది, యంత్రాలను పంపాలన్నారు. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తమిళనాడు సీఎం విజయ్.. వెంటనే సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : వాగు దాటించి గర్భిణికి ప్రాణరక్షణ.. 108 సిబ్బంది సాహసం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>