కలం, వెబ్‌డెస్క్ : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజిని (Vidadala Rajini) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడుతూ, ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. పోలింగ్ బూత్‌లలోకి చొరబడి మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు. అక్రమాలకు పాల్పడి సాధించిన విజయాన్ని గెలుపుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సి ఉండగా, ఎన్నికల పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా ఈ పరిణామాలను గమనించి, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఆలోచించాలని విడుదల రజిని పిలుపునిచ్చారు.

