కలం, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాపై సైబర్ దాడి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో అమెరికాలోని పలు సైనిక స్థావరాల్లో (US Military Bases) ఏర్పాటు చేసిన వాణిజ్య ఫ్రీజర్లు అకస్మాత్తుగా పని చేయడం మానేయడంతో వాటిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పాడైపోయాయి. ఇలా 12 చోట్ల ఫ్రీజర్లలో సమస్యలు తలెత్తడానికి సైబర్ దాడులు కారణమా అనే కోణంలో ‘పెంటగాన్’ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఫ్రీజర్లు పని చేయకపోవడంతో సైనికులు, వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు విక్రయించే సుమారు ఆరు కమిషనరీలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
అరిజోనాలోని ఫోర్ట్ హువాచుకాలో ఓ వాక్-ఇన్ ఫ్రీజర్ అనూహ్యంగా డీఫ్రాస్ట్ మోడ్ లోకి మారడంతో ఉష్ణోగ్రతలు పెరిగి రాత్రికి రాత్రే అందులోని ఆహార పదార్థాలు పాడయ్యాయి. ఈ ఘటనలపై అమెరికా సైబర్ కమాండ్, రక్షణ శాఖకు చెందిన సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తులో భాగంగా ఫ్రెంచ్ అధికారులతో అమెరికా సమన్వయం చేసుకుంటోంది. అక్టోబర్ లో ఫ్రాన్స్ లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. అక్కడి ఫ్రీజర్ల పనితీరులో సమస్యకు సైబర్ దాడి కారణం అని ఆ దేశ అధికారులు గుర్తించారు. అయితే, అమెరికాలో ఫ్రీజర్ల సమస్యలకు సైబర్ దాడే కారణమని అధికారులు ధృవీకరించలేదు. అమెరికా సైనికులు ఆకలితో అంతం కావాలనే కుట్ర జరిగినట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read : నివాస ప్రాంతంలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
Follow Us On: Instagram

