కలం, వెబ్ డెస్క్: మురసు తుపాన్ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు జిల్లాలో వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన నిజాంపట్నం మత్స్యకారులు (Nizampatnam Fishermen) ఎట్టకేలకు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో మత్స్యకారుల మోటార్ ఫైబర్ పడవ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. మురసు తుపాన్ ప్రభావంతో సముద్రంలో భారీ అలలు ఎగసిపడుతుండటంతో, మత్స్యకారులు తీరానికి రావడానికి ప్రయత్నించినప్పటికీ అలల ఉదృతి వల్ల మొదట వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
చివరకు స్థానిక మత్స్యకారులు సమయస్ఫూర్తితో స్పందించి సాయం చేయడంతో, బాధితులంతా పాత కడపాలి వద్ద సురక్షితంగా తీరానికి చేరుకోగలిగారు. సముద్రంలో చిక్కుకున్న ఈ మత్స్యకారులంతా బాపట్ల జిల్లా నిజాంపట్నం తీర ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. తుపాన్ కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం ఇంకా ప్రమాదకరంగానే ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలలు భారీగా ఎగసిపడుతున్నందున మత్స్యకారులు ఎవరూ సముంద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

