కలం, భైంసా: ముధోల్ నియోజకవర్గంలో రెండు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.5.90 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Mudhol MLA) బుధవారం తెలిపారు. తానూరు మండలం భామ్ని గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2.87 కోట్లు, కుబీర్ మండలం వాయిలింగి గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.3.02 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి గత నెల సంబంధిత శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని, స్పందించిన ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. లో వోల్టేజీ సమస్యతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు ఈ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

