కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం ఊపందుకుంటోంది. ఎన్ఆర్‌ఐ, వ్యాపార నేపథ్యం కలిగిన ప్రసన్న హరికృష్ణ బీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కేవలం ఒక నాయకుడి పార్టీ మార్పుగా కాకుండా గులాబీ పార్టీ భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త ముఖాలపై దృష్టి సారించడం ద్వారా కరీంనగర్‌లో ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తయారు చేయాలనే ‘లాంగ్ గేమ్’ ఆలోచనలో బీఆర్‌ఎస్ (BRS New Strategy) అగ్రనాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.
చేరిక కాకముందే రాజకీయం..
ఒక నాయకుడు పార్టీ మారిన వెంటనే ఓటు బ్యాంకు పెరిగిపోదు. కానీ, ఆ నాయకుడి చుట్టూ ఒక సరికొత్త పొలిటికల్ నెట్‌వర్క్ ఏర్పడితే పరిస్థితి మారుతుంది. ప్రసన్న హరికృష్ణ ద్వారా యువత, పట్టణ ప్రాంతాల విద్యావంతులు, వ్యాపార వర్గాలు, ప్రవాస నేపథ్యం ఉన్న కుటుంబాలను ఆకర్షించవచ్చనేది బీఆర్‌ఎస్ అంచనాగా కనిపిస్తోంది. ఈ చేరిక తక్షణ ఎన్నికల టికెట్ కోసం వేసే అడుగా? లేక ముందస్తుగా బలమైన రాజకీయ పునాదిని నిర్మించే ప్రయత్నమా? అన్నదే ప్రధాన చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్‌కు ‘కొత్త ముఖాల’ అవసరం ఏంటి?
కరీంనగర్ జిల్లాలో పార్టీకి పాత నాయకత్వమే ప్రధాన బలం. అయితే, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్త ఓటర్లను, ముఖ్యంగా తటస్థంగా ఉండే వర్గాలను ఆకట్టుకోవడానికి సంప్రదాయ శైలికి భిన్నమైన నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ‘నెక్స్ట్ జనరేషన్’ నాయకులను ప్రోత్సహించే అవకాశముంది.
గత ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ తన పునర్నిర్మాణ ప్రక్రియపై శ్రద్ధ వహిస్తోంది. అధికారంలో లేని ప్రస్తుత సమయంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా ప్రజాదరణ పొందిన బలమైన ముఖాలను చేర్చుకోవడం పార్టీకి ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కరీంనగర్ రాజకీయాల్లో ప్రసన్న హరికృష్ణ ఎంట్రీ పార్టీకి కొత్త ఊపునుస్తుందని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ..
అదిష్టానం నుంచి ప్రోత్సాహం ఉందన్న వార్తలు స్థానిక పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కొత్త నాయకుడి ఎంట్రీతో పార్టీలో ఎవరి ప్రాధాన్యం పెరుగుతుంది? ఎవరికి తగ్గుతుంది? అనే లెక్కలు మొదలయ్యాయి. హైకమాండ్ ఆశీస్సులు ఆరంభం మాత్రమే.. క్షేత్రస్థాయి కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, ప్రజల్లో సొంత బలాన్ని నిరూపించుకున్నప్పుడే ఆయన రాజకీయ భవిష్యత్తు స్పష్టమవుతుంది.
ప్రత్యర్థుల్లో మొదలైన లెక్కలు..
కరీంనగర్‌లో త్రిముఖ పోటీ బలంగా ఉన్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగాన్ని కాంగ్రెస్, బీజేపీలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. అయితే విదేశీ నేపథ్యం ఉన్న నాయకుడికి రోజువారీ ప్రజా రాజకీయాలు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడం, సోషల్ మీడియా దాటి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండటం అతిపెద్ద సవాలుగా మారనుంది.
ప్రస్తుతానికి “ప్రసన్న హరికృష్ణకు ఏ సీటు ఇస్తారు?” అనేదానికంటే “ఆయనను వేదికగా చేసుకుని కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎంత పెద్ద సామాజిక సమీకరణాన్ని నిర్మించగలదు?” అనేదే అసలు ప్రశ్న. రాబోయే రోజుల్లో ఆయన చేపట్టే రాజకీయ కార్యక్రమాలే ఈ వ్యూహం విజయవంతమవుతుందో లేదో తేల్చనున్నాయి.
కేటీఆర్ నుంచి ‘సానుకూల సంకేతాలు’?
ఈ వ్యవహారంలో ప్రధానంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సంప్రదింపుల అంశం ప్రచారంలోకి వచ్చింది. కేటీఆర్ నుంచి సానుకూల స్పందన ఉందన్న సంకేతాలు నిజమైతే, చేరికకు అధిష్ఠానం స్థాయిలో ప్రాథమిక అంగీకారం లభించినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధికారిక ప్రకటన వెలువడే వరకు ఏదీ నిర్ధారణ కాకపోయినప్పటికీ, ఈ స్థాయి చర్చ వెనుక బీఆర్‌ఎస్‌కు ఒక స్పష్టమైన రాజకీయ ప్రయోజనం కనిపిస్తోందనే అంచనాలు పెరిగాయి.
సన్నిహితులు, వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ..
ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కొత్త ముఖాలను బరిలోకి దించేముందు వారి బలాబలాలపై అంతర్గత సర్వేలు, అభిప్రాయ సేకరణ సాధారణమే. ప్రసన్న హరికృష్ణ సన్నిహితులు, స్థానిక నాయకులు, ప్రజావర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నారనే వార్తలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏ ప్రాంతాల్లో ప్రసన్న హరికృష్ణకు స్పష్టమైన ప్రభావం ఉంది ..ఏయే సామాజిక వర్గాల్లో మద్దతు లభిస్తుంది?..స్థానిక రాజకీయాల్లో ఓట్ల బదిలీ సామర్థ్యం ఎంత మేరకు ఉంది? అనే పలు కీలక అంశాలపై సమగ్రమైన లెక్కలు పూర్తయ్యాకే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
‘దుబాయ్’ నుంచి ప్రత్యక్ష రాజకీయాల వైపు..
ప్రసన్న హరికృష్ణ విదేశీ నేపథ్యం (దుబాయ్) నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండటం పట్ల కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత స్థానిక రాజకీయ వ్యవస్థతో మమేకమవ్వడం, పార్టీ కార్యకర్తలతో నిరంతరం అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై పోరాడటం ఆయనకు ప్రధాన సవాలుగా మారనుంది. ప్రచారం నుంచి ప్రత్యక్ష రాజకీయానికి మారడం మొదటి అడుగు అయితే దానిని ఓటు బ్యాంకుగా మలచుకోవడమే అసలైన పరిక్ష.

