కలం, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA) పవార్ రామారావు పటేల్ శుక్రవారం శ్రీకారం చుట్టారు. కిస్టాపూర్ గ్రామంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గోదాములు ఉపయోగపడతాయన్నారు. పంట చేతికొచ్చిన వెంటనే తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండదన్నారు. అవసరమైన సమయంలో విక్రయించుకునే అవకాశం ఉండటంతో రైతులకు మెరుగైన ధర లభించేలా గోదాములు దోహదపడతాయని పేర్కొన్నారు.
అనంతరం నర్సింహనగర్ తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అలాగే మరో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. తండాలో గోదాం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలతోపాటు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముధోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

