కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర విభజన సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన అలసత్వం, వైఫల్యం వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయని, అది తెలంగాణకు తీరని లోటుగా పరిణమించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నేడు భద్రాచలానికి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వల్ల తీవ్ర ముంపు ముప్పు పొంచి ఉందని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తలెత్తే బ్యాక్ వాటర్ ముప్పు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, దాని డిజైన్‌పై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం భద్రాచలం (Bhadrachalam) లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనులపై కలెక్టర్ అంకిత్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
ఎల్ నినో (El Nino) ప్రభావంతో ప్రస్తుతం వరద ఉధృతి లేకపోయినా.. భవిష్యత్తులో భద్రాచలం నుండి ములుగు వరకు సాధారణం కంటే 20 నుండి 25 అడుగుల మేర బ్యాక్ వాటర్ పెరుగుతుందని మంత్రి హెచ్చరించారు. ఈ ప్రమాదంపై గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, అయితే తెలంగాణ ప్రాంత ముంపు సమస్యలను కేంద్రం తప్పక దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
రాబోయే పార్లమెంట్ సమావేశాల నాటికి ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలందరితో కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని మంత్రి (Minister Ponguleti) ప్రకటించారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల జరిగే నష్టాన్ని కేంద్రానికి సమగ్రంగా వివరించి, డిజైన్ పునఃపరిశీలన అయ్యేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read : కొండా సురేఖ ఆరోపణల్లో వాస్తవం ఉండొచ్చు: బోయినపల్లి వినోద్
Follow Us On : WhatsApp

